: కేటీఆర్ పై వ్యాపారవేత్త కిడ్నాప్ ఆరోపణలు!
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు తనను కిడ్నాప్ చేయించారని ఆరోపిస్తున్నాడు ఒడిశా వ్యాపారవేత్త సుభాష్ అగర్వాల్. కొద్దిరోజుల క్రితం భువనేశ్వర్లో తనను అపహరించారని, అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పెందుర్తి వద్ద పోలీసులు రక్షించారని చెప్పాడు. నేడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానల్ తో అగర్వాల్ ఈ ఘటనను పంచుకున్నాడు. తనను కిడ్నాప్ చేసినవారిని పోలీసులు ప్రశ్నించగా.. వారిలో సతీశ్ రెడ్డి అనే వ్యక్తి తాను టీఆర్ఎస్ నాయకుణ్ణని, కేటీఆర్ చెబితేనే అగర్వాల్ ను తీసుకెళుతున్నామని చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం సతీశ్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడని అగర్వాల్ తెలిపాడు.
కాగా, కిడ్నాప్ సంఘటన అనంతరం తమకు పెద్దఎత్తున బెదిరింపులు వస్తున్నాయని వాపోయాడు. కేటీఆర్ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి బెదిరించారని ఈ ఒడిశా వ్యాపారవేత్త వెల్లడించాడు. టీఆర్ఎస్ నేతల పేరిట పలు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా రాజీ చేసుకోమని సూచించారని అగర్వాల్ తెలిపాడు. డబ్బు కోసమే కేటీఆర్ ఇలా చేసి ఉంటారని తాము భావిస్తున్నామని అగర్వాల్ చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే తమకు భయంగా ఉందని, వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అగర్వాల్ అన్నాడు.