: దగ్గుబాటీ.. కాచుకో: సుబ్బరామిరెడ్డి వార్నింగ్
విశాఖ పార్లమెంటు సీటు వివాదం మరింత ముదురుతోంది. టి. సుబ్బరామిరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య అగ్గి మరింత రాజుకుంటోంది. దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని లేదంటే రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని టీఎస్సార్ హెచ్చరించారు. అంతేగాకుండా, క్రిమినల్ కేసు కూడా పెడతానని స్పష్టం చేశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలంటూ దగ్గుబాటికి లీగల్ నోటీసులు కూడా పంపానని, ఆ గడువు కూడా పూర్తయిందని టీఎస్సార్ తెలిపారు.
ఇప్పటికైనా మించిపోయిందేమీలేదని, ఇకనైనా దగ్గుబాటి క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాజ్యసభ ఎంపీ అయిన టీఎస్సార్ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీచేయాలని పట్టుదల ప్రదర్శిస్తుండగా.. సిట్టింగ్ ఎంపీ పురందేశ్వరి తామెక్కడికీ వెళ్ళమని, ఇక్కడినుంచే పోటీచేస్తామని కరాఖండీగా చెప్పారు. అప్పటినుంచి టీఎస్సార్, పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.