: ఉత్తరా ఖండ్ వరదల బీభత్సం అసలు రూపమిది...


ఉత్తరాఖండ్ వరదల బీభత్సాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఏ చాటువులు చెప్పి ఆ దారుణాన్ని కళ్లకు కట్టగలం? భారత దేశం యావత్తూ దిగ్భ్రాంతికి గురయ్యే ప్రకృతి విపత్తు కేదార్ నాథ్ ఆలయాన్ని చుట్టుముట్టింది. భోళా శంకరుడి నెత్తిన ఉండే గంగమ్మ ఉగ్రరూపం దాలిస్తే జరిగే నష్టాన్ని ఒక్క సారిగా కళ్లకు కట్టింది. ప్రకృతి విలయతాండవానికి జీవుడు భీతిల్లిపోయేంత నష్టం జరిగింది. వేల మంది ఆచూకీ తెలియడం లేదు. స్థానికుల జాడలేదు. కుటుంబాలకు కుటుంబాలు గల్లంతయ్యాయి. దైవ సన్నిధిలో గడపడానికి వెళ్ళిన భక్తులు భయంతో చెల్లా చెదురైపోయారు.

శవాల గుట్టలను చూశానని కేదార్ నాథ్ ఆలయపూజారి తెలిపారు. 20 నిమిషాల్లోనే దారుణం జరిగిపోయిందని, నాలుగైదు వేల మంది ఇక్కడే చనిపోయి ఉంటారని తన కుటుంబ సభ్యుల ఆచూకీ ఇంకా తెలియలేదని వాపోయాడా పూజారి. 14 అడుగులకంటే ఎత్తున ఉండడంతో తనతో పాటు మరో 200 మంది బ్రతికి బట్టకట్టామని తెలిపాడు. మరో వైపు 190 బ్రిడ్జిలు తెగిపోయాయి. రహదారులు కొట్టుకుపోయాయి. నడక మార్గం ఏ రీతిగా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎటువైపు చూసినా అన్నార్తుల ఆకలికేకలే!

16 వ తేదీన సంభవించిన వరదలకు కేదార్ నాధ్ ఆలయం రూపు రేఖలు మారిపోయాయి. ఈ శైవ పీఠం ఇప్పుడు శివునికి ప్రీతి పాత్రమైన శ్మశానాన్ని తలపిస్తోంది. ఇళ్లు, ఊళ్లు అన్నీ ఏకమై కొట్టుకుపోయాయి. కాలి నడక భక్తులు కొండకోనల్లో చిక్కుకుపోయారు. యాత్రీకుల్లో చిన్న పిల్లలు, వృద్దులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. తినేందుకు తిండి దొరకక, ఉండేందుకు వసతి లేక ఎక్కడెక్కడో ఒకరికి ఒకరు తెలియని ప్రాంతాల్లో చెల్లా చెదురైపోయారు. వీరంతా స్వస్థలాలకు చేరేందుకు మరింత సమయం పడుతుంది.

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ, పునరావాస చర్యలకు శ్రీకారం చుట్టాయి. నిన్న కాస్త శాంతించిన వరుణదేవుడికి దండం పెడుతూ త్రివిధ దళాలకు చెందిన ఐదు బెటాలియన్లకు చెందిన సైనికులకు తోడు బోర్డర్ సెక్యూరిటీ ఫొర్స్, ఇండో టిబెటన్ ఫోర్స్ ను కూడా వినియోగిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో సహయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయా ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు వైమానిక దళానికి చెందిన 40 హెలీ కాప్టర్లను వినియోగిస్తున్నారు.

అధికారికంగా ఇప్పటి వరకూ 190 మంది ప్రాణాలను బలితీసుకుందని అధికారులు ప్రకటించారు. హరిద్వార్ సమీపంలో 40 మృతదేహాలను వెలికి తీశారు. 40 హెలీ కాప్టర్లతో 9 వేల మందిని రక్షించారు. చార్ ధామ్ యాత్రీకులను రాష్ట్రానికి చేర్చేందుకు దక్షిణ్ ఎక్స్ ప్రెస్ కు 4 బోగీలు ఏర్పాటు చేశారు. పలు జిల్లాలకు చెందిన పలువురు యాత్రీకులకు సంబంధించిన సమాచారం ఇంకా అందకపోవడంతో వారి కుటుంబాలకు చెందిన వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఉత్తర కాశీ దగ్గర సుఖియా వద్ద 150 మంది తెలుగువారు చిక్కుకున్నారని, వీరంతా గుడివాడ, తుని ప్రాంతాలకు చెందిన వారని కుటుంబసభ్యులకు సమాచారమందించారు.

  • Loading...

More Telugu News