: మొబైల్‌తోనే కాదు... చేతితో కూడా మాట్లాడొచ్చు
ఇకపై మీ అరచేయే మీకు మొబైల్లాగా మారుతుందేమో... అంటే ఫోన్ కొనాల్సిన పనిలేదని సంతోషిస్తున్నారా...? అదేంకాదు... ఫోను ఉండాల్సిందే... అయితే ఫోనుతోబాటు మీ చేతికి ఒక కొత్త గ్లవ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, మీరు చేతితో మాట్లాడాలనుకుంటే ఈ గ్లవ్ కొనాల్సిందే. బ్రిటన్‌కు చెందిన సియాన్ మైల్స్ అనే ఆయన ఒక కొత్త తరహా చేతి గ్లవ్స్‌ను తయారు చేశారు. ఈ గ్లవ్స్ ధరిస్తే అప్పుడు మీ అరచేయే మీ సెల్‌ఫోన్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్కా మీ ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని మాట్లాడాల్సిన పనిలేకుండా... ఇలా చేతినే మీ నోటి దగ్గర పెట్టేసుకుని మాట్లాడేయొచ్చు.
సియాన్ మైల్స్ 'టాక్ టు ద హ్యాండ్' పేరుతో ఒక కొత్తరకం చేతి గ్లవ్స్ తయారు చేశారు. ఈ గ్లవ్స్‌కు బొటనవేలి దగ్గర స్పీకర్ యూనిట్, చిటికెన వేలి దగ్గర మైక్రోఫోన్ అమర్చారు. ఈ గ్లవ్స్‌తో ఏ మొబైల్ నుండైనా బ్లూటూత్ సహాయంతో కాల్స్ చేసి మాట్లాడేయొచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల పునర్వినియోగ ప్రాజెక్టులో భాగంగా మైల్స్ ఈ కొత్తరకం గ్లవ్స్‌ను తయారు చేశారు. వచ్చే నెలలో ఒక ప్రదర్శనలో పెట్టనున్న ఈ చేతి గ్లవ్స్ ధర సుమారు రూ.92 వేలు మాత్రమే...!!