: లంకేయుల భరతం పట్టిన భారత బౌలర్లు... శ్రీలంక 181/8
టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. మబ్బుపట్టిన కార్డిఫ్ ను తమ పదునైన బంతుల్తో వేడెక్కిస్తూ శ్రీలంక బ్యాట్స్ మన్ కు దడపుట్టించారు. వాడివేడి కలిగిన బంతులను సంధించి ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. భువనేశ్వర్ ప్రారంభిస్తే ఆ వేగాన్ని ఇషాంత్ శర్మ కొనసాగించాడు. అనంతరం పేస్ బౌలర్ల స్ఫూర్తితో అశ్విన్ తిప్పేశాడు దీంతో శ్రీలంక కనీసం రెండొందల మార్కు కూడా దాటలేకపోయింది. టీమిండియా ధాటికి మాధ్యూస్(51) ఒక్కడే అర్ధ సెంచరీ మార్కు చేరుకున్నాడు. అతనితోపాటు జయవర్ధనే(38) ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
టీమిండియా బౌలర్లలో ఇషాంత్, అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా భువనేశ్వర్, జడేజా ఒక్కో వికెట్ తీశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన టీమిండియా కాస్త కుదురుగా ఆడితే విజయలక్ష్యం అసాధ్యమైనది కాదు. కానీ మలింగ, కులశేఖర, పేరీరా, మెండిస్ లను ఎదుర్కోవడం సవాలే. జోరుమీదున్న టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.