: 24 గంటల్లోనే కేసు ఛేదించిన విశాఖ పోలీసులు
దేశపాత్రుని పాలెంలో స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ వాసుశ్రీ ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలను విశాఖ పోలీసులు 24 గంటలు గడవకముందే పట్టుకున్నారు. గత అర్ధరాత్రి వాసుశ్రీ ఇంట్లో చొరబడి ఆమెను, ఆమె భర్తను తాళ్లతో కట్టేసి చితక్కొట్టి మరీ 50 తులాలు బంగారం, కొంత నగదును దోచుకెళ్లారు. బాధితులు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 48 గంటలు గడిస్తే కానీ వారి పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో జరిగిన ఘటన పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు బృందాలుగా విడిపోయి కేసును 24 గంటలు గడవక ముందే ఛేదించారు. బాధితులు ఇంకా కోలుకోకముందే పోలీసులు దోపిడీ ముఠా గుట్టు విప్పడాన్ని పలువురు అధికారులు అభినందిస్తున్నారు.
నిందితులు వాలీబాల్ లో బెట్టింగ్ లకు పాల్పడి భారీగా అప్పులపాలై ఈ దురాగతానికి పాల్పడినట్టు చెబుతున్నారు. వీరినుంచి పోలీసులు 50 తులాల బంగారం, 15 వేల రూపాయల నగదు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు సభ్యులు కలిగిన ఈ ముఠాలో ఇద్దరు స్టీల్ ప్లాంట్ క్యాజువల్ ఆఫీస్ బాయ్స్ ఉన్నారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు.