: విదేశీ ఉద్యోగాలు ఎరవేసి కోటికిపైగా డబ్బుతో జంప్
నిరుద్యోగులను ఆశలపల్లకీ ఎక్కించి అందినకాడికి దండుకుని, వారి నెత్తిన శఠగోపం పెట్టి, ఆనక జంపు చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. దీంతో విదేశీ ఉద్యోగాల మోజులో 60 మంది వరకూ నిరుద్యోగులు దారుణంగా నష్టపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన పులుపు పద్మావతి, తన అల్లుడు చిత్తూరు శ్రీనివాసరావుతో కలిసి, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాల ఏర వేసింది. అఫ్ఘనిస్తాన్ పంపిస్తామని చెప్పి, 60 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి లక్ష, రెండు లక్షలు చొప్పున సుమారు కోటికిపైగా వసూలు చేశారు. 5 నెలల క్రితం కొంతమందిని దుబాయ్ తీసుకెళ్లి మూడునెలలు వారిని అక్కడే ఉంచి తిరిగి గ్రామానికి పంపించారు. దీంతో బాధితులు పద్మావతి ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బు తమకు చెల్లించాలని డిమాండ్ చెయ్యడంతో పద్మావతి ఆమె అల్లుడు పరారయ్యారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.