: టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ... ఆస్తుల గోల
టీఆర్ఎస్, టీడీపీల మధ్య ఆస్తుల వివాదం చినికిచినికి గాలివానలా తయారైంది. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్ ఆస్తులు సంపాదించాడు అని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఆస్తులపై సీబీఐ విచారణకు రెడీ అంటే కేసీఆర్ కుటుంబం కూడా సిద్దమని సవాలు విసిరారు. '2 ఎకరాల నుంచి వేలకోట్ల ఆస్తులు ఎలా సంపాదించావో అందరికీ తెలుసని' హరీష్ రావు అన్నారు. దమ్ముంటే సీబీఐ విచారణ ఎదుర్కోవాలని ఛాలెంజ్ చేసారు.
మరో వైపు హరీష్ రావుకు దీటుగా టీడీపీ నేతలు స్పందించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు నీతిమంతులే అయితే తమపై వచ్చిన ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలని కోరారు. సకలజనుల సమ్మెను 5 వందల కోట్లకు అమ్ముకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలను వైయస్ కు ప్యాకేజీలకు అమ్ముకున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలే నిజమైన తెలంగాణ ద్రోహులని మండిపడ్డారు.