: లై డిటెక్టర్ పరీక్షకు ఓకే చెప్పిన రాజాభయ్యా
కొద్దినెలల క్రితం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న డీఎస్పీ హత్య కేసులో లై డిటెక్టర్ పరీక్షకు మాజీ మంత్రి రాజాభయ్యా అంగీకరించారు. గత మార్చి 2న రాజాభయ్యా నియోజకవర్గంలో కుందా డీఎస్పీ జియా ఉల్ హక్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ హత్యాకాండలో రాజాభయ్యా అంగరక్షకుడు కూడా పాల్గొన్నట్టు సాక్ష్యులు చెబుతున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంలో రాజాభయ్యాపై హత్యారోపణలు వెల్లువెత్తడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. ఈ నేపథ్యంలో ఆయన నేడు లక్నోలోని సీబీఐ న్యాయస్థానం ముందు హాజరయ్యారు.
తాను లై డిటెక్టర్ పరీక్షకు అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, సీబీఐ.. రాజాభయ్యాకు ఈ హత్యతో సంబంధం ఉందని ఇంతవరకు స్పష్టమైన ఆధారాలు సంపాదించలేకపోయింది. ఛార్జిషీటు దాఖలు చేసినా, అందులో మాజీమంత్రి పేరు చేర్చడంలో విఫలమైంది. దీంతో, ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని కోర్టుకు విన్నవించుకుంది. దీనికి సీబీఐ కోర్టు ఆమోదముద్ర వేసింది.