: ఆ ముగ్గురు క్రికెటర్లకు మళ్ళీ మొండిచేయి


వెస్టిండీస్ లో ఈ నెలాఖరున మొదలయ్యే ముక్కోణపు టోర్నీలో పాల్గొనే టీమిండియాను నేడు ప్రకటించారు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న యువ జట్టునే యధాతథంగా ఎంపిక చేశారు. దీంతో, దిగ్గజత్రయం వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ లకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈనెల 28న ఆరంభయ్యే ట్రయాంగ్యులర్ సిరీస్ లో భారత్, విండీస్ లతో పాటు మూడోజట్టుగా శ్రీలంక పాల్గొంటుంది.

ధోనీ నాయకత్వంలో చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న భారత జట్టులో కుర్రాళ్ళు ఆకట్టుకోవడంతో సెలెక్టర్లకు పెద్దగా పనిలేకుండా పోయింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా కుదురుకోవడం.. మిడిలార్డర్లో కోహ్లీ, ధోనీ, జడేజా రాణిస్తుండడంతో బ్యాటింగ్ విభాగంలో సమస్యలేవీ కనిపించడంలేదు.

ఇక, భువనేశ్వర్ కుమార్, సీనియర్ ఇషాంత్ శర్మ సీమ్ కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్ లపై నిప్పులు చెరిగే పేస్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కకావికలం చేస్తున్నారు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ.. ఆయా జట్లను ఒత్తిడిలోకి నెడుతున్నారు. స్పిన్ విషయానికొస్తే భారత్ అమ్ములపొదిలో వైవిధ్యం కనిపిస్తోంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కు తోడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన అద్భుత లెఫ్టార్మ్ స్పిన్ తో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీంతో, గెలుపుబాటలో పయనిస్తున్న జట్టులో మార్పులు చేయడం ఎందుకనుకున్నారో ఏమో సెలెక్టర్లు యువ జట్టుపైనే నమ్మకం ఉంచారు.

  • Loading...

More Telugu News