: 'చిట్టి' వచ్చేశాడు...!!


మనలాంటి మరమనుషులు వస్తున్నారు. రోబో సినిమాలో చిట్టి గుర్తున్నాడా... యంత్రుడు... అలాంటి యంత్రుల సృష్టి జరిగింది. వీటిని సృష్టించింది రోబో సినిమాలో వసీకర్‌ మాత్రం కాదులెండి... సదరు యంత్రుడి సృష్టికర్తపేరు హిరోషి ఇషిగురో. ఈ రోబో చక్కగా మనుషుల్లాగా కళ్లను కూడా ఆర్పగలదు. న్యూయార్క్‌లో జరిగిన ఒక సదస్సులో హిరోషి ఇషిగురో తాను సృష్టించిన అచ్చు తనను పోలిన రోబోను ప్రదర్శించాడు. ఈ రోబో చిన్న చిన్న కదలికలను చూపించడంతోబాటు కళ్లను ఆర్పడం వంటి చర్యలతో సంచలనం సృష్టించింది. అంతేకాదు... ఓ చిన్న పాటి ఉపన్యాసం కూడా ఇచ్చి అందరినీ అబ్బురపరచింది.

న్యూయార్క్‌లో జరిగిన 'గ్లోబల్‌ ఫ్యూచర్స్‌ 2045 ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌' సదస్సులో ఈ రోబోను ప్రదర్శించారు. మనుషుల్లాగే ఉండే రోబోలను జెమినాయిడ్‌ అంటారు. జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయంలో ఇంటెలిజెంట్‌ రోబోటిక్స్‌ లేబొరేటరీకి సంచాలకుడిగా ఉన్న హిరోషి ఇషిగురో దీన్ని తయారు చేశాడు. ఈ సదస్సులో ఇషిగురో తనలాంటి రోబోనే కాకుండా మరో మహిళను పోలివుండే రోబోను కూడా తయారు చేశాడు. ఈ ఆడరోబో ఆ సదస్సులో ఎంచక్కా క్యాట్‌వాక్‌ చేసిందిట. అంతేకాదు, ఆడ, మగ జెమినాయిడ్‌లతో ఇషిగురో అంతర్జాతీయ సదస్సు బయట ఒక నాటకం కూడా వేయించాడట.

ఈ జెమినాయిడ్లనే కాకుండా టెలినాయిడ్‌, ఎల్ఫాయిడ్‌ అనే మరో రెండు రకాల రోబోలను కూడా ఇషిగురో ఈ సదస్సులో పరిచయం చేశాడు. జెయినాయిడ్‌కు చర్మం, అలంకారాలేవీ లేకపోతే అదే టెలినాయిడ్‌. ఈ టెలినాయిడ్‌ పిండిబొమ్మలా ఉంటుంది. ఈ టెలినాయిడ్‌ వృద్ధులకు చాలా నచ్చేసిందట. ఇక మూడోదైన ఎల్ఫాయిడ్‌ అనేది మన అరచేతి పరిమాణంలో ఉండే అతి చిన్న టెలినాయిడ్‌ బొమ్మ. ఇది అచ్చు మన సెల్‌ఫోన్‌ లాంటిదేనట. మనకెవరూ కాల్‌ చేయక పోయినా దాంతో మనం మాట్లాడుతూ ఉండొచ్చట.

ఇక క్యాట్‌వ్యాక్‌ చేసిన ఆడరోబో వస్త్రాలను ఈ సదస్సులో జనాలు ఎగబడి కొన్నారట. కొసమెరుపేంటంటే... సదస్సులో చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చిన ఇషిగురోను పోలిన జెమినాయిడ్‌ తన ప్రసంగంలో 'చూస్తూ ఉండండి... వచ్చే ఏడాది అసలైన ఇషిగురో కంటే నేనే మంచి ఉపస్యాసం ఇస్తాను...' అందట. ఏంటో... ఈ జెమినాయిడ్‌ చివరికి చిట్టిలాగా తయారవుతుందా...?!

  • Loading...

More Telugu News