: సిక్స్ ప్యాక్ 38 కోట్ల ఏళ్ల క్రితమే ఉండేదట!
సినీ హీరోలు సిక్స్ ప్యాక్ కోసం ఇప్పుడు తెగ కష్టపడుతున్నారు కానీ, దీనికి పెద్ద చరిత్రే ఉందండోయ్! 38 కోట్ల సంవత్సరాల క్రితం ఓ జాతి చేపలకు సిక్స్ ప్యాక్ ఉండేదని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాయువ్య ఆస్ట్రేలియాలో 38 కోట్ల ఏళ్లనాటి కవచయుత చేప శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై పరిశోధనలు చేసిన స్వీడిష్, ఆస్ట్రేలియన్, ప్రెంచ్ శాస్త్రవేత్తలు హై కాంట్రాస్ట్ ఎక్స్ రే చిత్రాల ద్వారా ఈ శిలాజం దెబ్బతినకుండా ఆనాటి ప్లాకోడెర్మాల మెడ, ఉదరభాగాల్లోని కండర నిర్మాణాన్ని తాజాగా పునర్నిర్మించారు.
దీంతో ఆ తరం సకశేరుకాల్లో మెడ, ఉదరకండరాల నిర్మాణం శక్తిమంతంగా, పలకల మాదిరిగా ఉండేదని తేలింది. అయితే ప్రస్తుత చేపల్లో ఈ రకమైన కండర నిర్మాణం లేదని, దీన్ని బట్టి సకశేరుకాల్లో చాలా కాలం క్రితమే కండరాలు బాగా అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే, అప్పట్లో చేపలు సిక్స్ ప్యాక్ తో అలరారాయన్నమాట!