: లాఠీలు పక్కనపెట్టిన ముంబయి పోలీసులు
ముంబయి పోలీసులు లాఠీలు పక్కనబెట్టారు. అవును, మీరు విన్నది నిజమే. మరి పోలీసులు లాఠీలకు విశ్రాంతినిస్తే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడదా..? అని సందేహం వస్తే.. ఇది చదవండి. ప్రస్తుతం ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు బాగా విస్తరించడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. స్కూళ్ళు, ఆఫీసులు సెలవు ప్రకటించాయి. రవాణా వ్యవస్థ కుంటుపడింది. దీంతో, సహాయకచర్యలకు మహారాష్ట్ర సర్కారు నడుంబిగించింది.
ఈ సహాయకచర్యలకు 14 వేలమంది పోలీసులను వినియోగించాలని నిర్ణయించింది. వీరిలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు నుంచి కానిస్టేబుళ్ళ వరకు ఉన్నారు. అంతేగాకుండా, క్రైమ్ బ్రాంచ్ సేవలను ఇందుకు ఉపయోగించనున్నారు.
వీరిపనల్లా.. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ట్రాఫిక్ ను పునరుద్ధరించడం, పారిశుద్ధ్య పరిరక్షణతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలను సాగించడమే. ఇదంతా నిర్విరామంగా సాగిపోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే, పోలీసుల విలువైన సమయం వృథా కాకూడదనే అట!