: ఈ వాచీ బీపీని కొలుస్తుంది!
చేతికి ధరించే వాచీలు ఒకప్పుడు కేవలం సమయాన్ని చూపించేవిగా ఉండేవి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఇప్పుడు వాచీలు కేవలం అలంకరణార్ధం మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా మనకు తోడ్పడే విధంగా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. దీంతో ఈ కొత్త రకం వాచీలతో అటు అందానికి అందం, ఇటు మన ఆరోగ్య పరంగానూ తోడ్పడుతూ ఉంటాయి. ఈ తరహాలోనే ఒక కొత్త రకం వాచీని ఉత్పత్తి చేశారు ఒక కంపెనీవారు. ఈ వాచీని చేతికి పెట్టుకుంటే అది మన రక్తపోటును కొలుస్తుందట.
మనం సాధారణంగా రక్తపోటు ఎంతవుంది అనేది పరీక్షించుకోవాలంటే డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వాచీ పెట్టుకుంటే ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఈ వాచీ మన రక్తపోటును కొలుస్తుంది. ఈ వాచీకి చాలా గ్రాహకాలు ఉంటాయి. ఇవి మణికట్టు చర్మం వద్ద ఒత్తిడి, రక్తప్రవాహం, నాడీ వేగం వంటి వాటిని పసిగట్టి మన రక్తపోటును గణించి చూపిస్తాయి. ఈ వాచీని ఉత్పత్తి చేసిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ చుడిన్ మాట్లాడుతూ తాము రూపొందించిన ఈ వాచీని వైద్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చని, అలాగే క్రీడాకారులకు ఆటలు ఆడే సమయంలో హృదయస్పందన వేగాన్ని, రక్తపోటును నియంత్రించేందుకు కూడా వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఈ వాచీ పనితీరు గురించి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. అటు వైద్య పరంగాను, ఇటు అలంకరణార్ధం, సమయాన్ని సూచించేదిగానూ ఇలా రెండు రకాలుగానూ ఉపయోగపడేలా ఈ వాచీని రూపొందించేందుకు కంపెనీవారు ప్రయత్నిస్తున్నారు.