: హైదరాబాద్ గరంగరం
హైదరాబాద్ వేడెక్కుతోంది. రాజకీయ జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో పోలీసుల పహారాతో నగరం మొత్తం నిఘానీడన బిక్కుబిక్కుమంటోంది. అయితే అనుమతులు కావాలంటూ తెలంగాణలోని పార్టీలన్నీ గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీ లను కలిసినా ఫలితం లేకపోవడంతో పార్టీలన్నీ ఛలో అసెంబ్లీని నిర్వహించి తీరుతామని శపథం చేశాయి.
పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. మరో వైపు ఉస్మానియా విద్యార్థులు బ్యాచ్ బ్యాచ్ లుగా అసెంబ్లీ వైపుగా వచ్చి హడావుడి సృష్టిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో అసెంబ్లీ ఉద్యోగులకు అధికారులు 24 గంటల డ్యూటీలు వేశారు. దీంతో అక్కడి ఉద్యోగులతో అసెంబ్లీ కళకళలాడుతోంది.
నగరంలో శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగిస్తారనుకున్న వ్యక్తులందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే జంటనగరాల్లోని మద్యం దుకాణాలకు పోలీసులు 36 గంటల సెలవు ప్రకటించారు. తేడా వస్తే పోలీసులు తడాఖా చూపిస్తామంటున్నారు. రాజధానికి రాకపోకలు సాగించే పలురైళ్లను రైల్వేశాఖాధికారులు రద్దు చేశారు. మరిన్ని రైళ్లను పూర్తి భద్రతతో సాగనంపనున్నారు.
ప్రభుత్వ చర్యలన్నీ గమనిస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ వంతుల వారీగా ఛలో అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రణాళికలు రచించింది. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారిని నిరోధిస్తుండడంతో నగరంలోని పార్టీల మద్దతుదారులతో ఛలో అసెంబ్లీని విజయవంతం చేసేందుకు జేఏసీ రంగం సిద్దం చేస్తోంది. అసెంబ్లీకి అన్నివైపుల నుంచి రాజకీయనాయకులు చుట్టుముట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. వీర్ని ఎదుర్కొనేందుకు బలగాలతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు.
మరో వైపు వీటితో సంబంధం లేకుండా పాతబస్తీవాసులు ప్రశాంతంగా ఉన్నారు. అక్కడి జనజీవనంపై ప్రజలంతా భరోసాతో ఉన్నారు. మిగిలిన నగరంతో సంబంధం లేనట్టుగా అక్కడి ప్రజలు దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నులైపోతున్నారు.