: శునకాన్ని వెంటేసుకెళ్ళింది.. జరిమానా కట్టింది!


చట్టం ఎవరికీ చుట్టం కాబోదు, అని నిరూపించేలా.. ఈ ఘటన జరిగింది. జెట్ ఎయిర్ వేస్ అధిపతి నరేశ్ గోయల్ భార్యామణి అమితా గోయల్ ఓ కుక్కతో విమానంలో ప్రయాణించిందంటూ ఆమెపై కస్టమ్స్ అధికారులు జరిమానా విధించారు. విధిలేని పరిస్థితుల్లో ఆమె జరిమానా చెల్లించి కుక్కను దక్కించుకుంది. విషయం ఏమిటంటే.. అమితా గోయల్ లండన్ నుంచి వస్తూ వస్తూ తన పెంపుడు కుక్కను వెంటేసుకుని వచ్చింది. ఆ విమానం స్వంత సంస్థ జెట్ ఎయిర్ వేస్ కు చెందినదే అయినా.. విమానాశ్రయ అధికారులు తమ వారు కాదుకదా! అందుకే అడ్డుచెప్పారు.

విమానాల్లో పెంపుడు జంతువులను రవాణా చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ.. రూ.36,200 జరిమానా వడ్డించారు. లేకుంటే కుక్కను వదులుకోవాల్సి ఉంటుందని సూచించారు. ప్రియశునకాన్ని వదులుకోలేని అమితా చివరికి వారు పేర్కొన్న మొత్తాన్ని చెల్లించి.. కుక్కను దక్కించుకుని ఊపిరి పీల్చుకుంది. భారత కస్టమ్స్ చట్టం ప్రకారం విమానంలో జంతువులను రవాణా చేయడం నేరమని తెలుసుకోకపోతే ఎంతటివారైనా ఫైన్ కట్టాల్సిందే అని తాజా ఉదంతం చాటుతోంది.

అయితే, ఇక్కడో చిన్న సవరణ ఉందండోయ్. ప్రయాణికుడు వికలాంగుడో, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తో అయితే.. అతనికి తోడుగా పెంపుడు జంతువులు ఉండడానికి మన కస్టమ్స్ చట్టాలు అంగీకరిస్తాయి. అంతేగాకుండా, పెంపుడు జంతువుల నివాస స్థలం మార్పు సందర్భంగా వేరే ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు కూడా వాటిని విమానాల్లోకి అనుమతిస్తారు.

  • Loading...

More Telugu News