: రోదసిలో చైనా ఐదో విజయం


అగ్రరాజ్యాలకు దీటుగా చైనా చెపట్టిన రోదసి యాత్ర విజయవంతంగా ప్రారంభమయింది. రోదసిలో థియోంగ్‌గాంగ్‌-1 స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసే పనిలో భాగంగా ఐదోసారి చేపట్టిన ఈ మానవసహిత రోదసి యాత్ర మాత్రం ఇప్పటి వరకూ చేసిన యాత్రలకన్నా సుదీర్ఘమైంది. ఒక మహిళతో కూడిన ముగ్గురు వ్యోమగాములు మంగళవారం నాడు షెంజౌ-10 అనే వ్యోమనౌకలో రోదసిలోకి ప్రయాణం ప్రారంభించారు. గన్స్‌ ప్రావిన్స్‌లోని జియుక్వాన్‌ ఉపగ్రహ కేంద్రం నుండి ఈ నౌక ప్రయాణం ప్రారంభించింది. లాంగ్‌మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ కార్యక్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తిలకించారు. సుమారు 15 రోజుల పాటు సాగే ఈ యాత్రలో కక్ష్యలో ఉన్న థియోంగ్‌గాంగ్‌-1 స్పేస్‌ ల్యాబ్‌తో ఈ నౌక అనుసంధానమవుతుంది. నియ్‌ హైషెంగ్‌ నాయకత్వం వహిస్తున్న ఈ రోదసి నౌకలో చైనా రెండవ మహిళా వ్యోమగామి వాంగ్‌ యాపింగ్‌ (33), ఝాంగ్ జియా వోగువాంగ్‌లు ఉన్నారు.

కాగా 2020 నాటికి రోదసిలో థియోంగ్‌గాంగ్‌-1 సేవలు ప్రారంభించేలా చేయాలని చైనా భావిస్తోంది. అయితే ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా చైనా కమ్యూనిస్టు పార్టీ అవతరించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ అటు అంతరిక్షంలో కూడా తమ పార్టీ శాఖను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ఉపగ్రహ కేంద్రం సేవలు ప్రారంభమయ్యాక ఈ పార్టీ పనులు కూడా ప్రారంభమవుతాయని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అంతరిక్షంలోకి వెళ్లిన ముగ్గురు సభ్యులు కూడా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే. ఈ విషయం గురించి చైనా తొలి వ్యోమగామి యాంగ్‌ లివెయ్‌ మాట్లాడుతూ దేశానికి సొంత అంతరిక్ష కేంద్రం అంటూ ఏర్పడితే చైనా వ్యోమగాములు అక్కడ కూడా పార్టీ శాఖను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News