: 'ఆరోజు' ఏం జరిగినా సర్కారుదే బాధ్యత: హరీశ్
'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపై టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈ నెల 14న 'చలో అసెంబ్లీ' పేరిట ర్యాలీ నిర్వహించనుండగా.. ఆ రోజున ఏం జరిగినా సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. అనుమతి విషయమై రేపు మరోసారి సీఎంను కలుస్తామని ఆయన చెప్పారు. సానుకూల నిర్ణయం వెలువరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చు స్వరంతో వ్యాఖ్యానించారు. ఇక హరీశ్ తెలంగాణ మంత్రులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చలో అసెంబ్లీ' కార్యక్రమంలో పాల్గొనకుండా, తెలంగాణ వాదులను, పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రులను ప్రశ్నించారు.