: ఆ ముగ్గురూ కలిశారు.. మొండిచేయి చూపారు: హరీశ్ రావు ఆరోపణ
రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరందరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారని, వీరు ముగ్గురూ కలిసి తెలంగాణ రైతులకు మొండిచేయి చూపుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఆంధ్రా రైతులకు ఓ న్యాయం.. తెలంగాణ ప్రాంత రైతులకు మరో న్యాయం అమలు చేస్తూ.. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
నీలం తుపానులో నష్టపోయిన కోస్తా రైతులకు ఆగమేఘాలపై నష్టపరిహారం చెల్లించిన సర్కారు.. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కుదేలైన రైతన్నలకు పైసా విదల్చలేదని హరీశ్ దుయ్యబట్టారు. ఓ సందర్భంలో తెలంగాణకు ఒక్క పైసా కూడా రాల్చనని సీఎం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా, దాన్ని అమల్లో పెడుతున్నట్టుందని ఆయన అన్నారు.
వడగళ్ళ వానతో తెలంగాణ రైతులు నష్టాల పాలవుతుంటే ఈ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. రేపటిలోగా తెలంగాణ ప్రాంత రైతులకు నష్ట పరిహారం ప్రకటించక పోతే సంబంధింత శాఖల మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.