Adil Hussain: ఆ టెర్రరిస్టులను మాకు అప్పగించండి చాలు... వాళ్లో మేమో తేల్చుకుంటాం: హార్స్ రైడర్ అదిల్ అత్త సలీమా

- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి
- పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో స్థానిక పోనీ గైడ్ ఆదిల్ హుస్సేన్ మృతి
- ఉగ్రవాది తుపాకీ లాక్కొని, పర్యాటకులకు అడ్డుగా నిలిచి ప్రాణాలు కోల్పోయిన ఆదిల్
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన స్థానిక పోనీ గైడ్, హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అతడి కుటుంబం తీరని దుఃఖంలో ఉంది.
ఆదిల్ అత్త సలీమా తాజాగా మీడియాతో మాట్లాలాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అదిల్ ఒక ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బుల్లెట్ అతని చేతిలోకి దూసుకెళ్లింది. అయినా లెక్కచేయకుండా, తన గుర్రాలపై ఉన్న పర్యాటకులకు అడ్డుగా నిలబడి 'వారిని చంపకండి' అని అరిచాడు. అదిల్ దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవాడు. వెనుక నుంచి కాల్చడంతో బుల్లెట్లు ఛాతీలోకి దూసుకెళ్లి ప్రాణాలు తీశాయి" అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దాడి జరిగిన రోజు ఆదిల్‌కు పనిలో చివరి రోజని, తర్వాత కొన్ని రోజులు సెలవు తీసుకోవాలనుకున్నాడని అతని సోదరి తెలిపింది.
ఉగ్రవాదుల చర్య పట్ల అత్త సలీమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వారు మనుషులే కాదు... సిగ్గులేని వాళ్ళు. వారిని మాకు అప్పగించాలి. మాకు సైన్యం అవసరం లేదు. ఆ ఉగ్రవాదులను మాకు అప్పగించండి చాలు... వాళ్లో మేమో తేలిపోవాలి. ఆరు రోజుల క్రితం పెళ్లయిన ఒక అమ్మాయిని విధవరాలిని చేశారు... వాళ్ళు ఏ నీచపు కుటుంబం నుంచి వచ్చారో!" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యాటకులను కాపాడే ప్రయత్నం చేయకుండా ఉంటే మీ అబ్బాయి బతికేవాడు కదా అని అడిగిన ప్రశ్నకు, ఆదిల్ తండ్రి హైదర్ షా బదులిస్తూ, "మా అబ్బాయి గురించి కంటే ఆ పర్యాటకుల గురించే మాకు ఎక్కువ బాధగా ఉంది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆరు రోజుల క్రితం పెళ్లయిన అమ్మాయి, తండ్రిని కోల్పోయిన మరో అమ్మాయి, పిల్లలను కోల్పోయిన వారు... వారంతా అమాయకులు. వారిని కాపాడే ప్రయత్నంలో నా కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అతను మమ్మల్ని గర్వపడేలా చేశాడు" అని అన్నారు.
ఆదిల్ ఆ కుటుంబానికి ఏకైక సంపాదన పరుడు. "అతని తండ్రి అనారోగ్యంతో ఉన్నారు, నేను కూడా అంతే. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేయాలి?" అంటూ ఆదిల్ తల్లి తన గోడు వెళ్లబోసుకున్నారు.