Somishetti Madhusudhan Rao: మధుసూదన్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ వాసి మృతి
- మృతుడు కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన రావు
- బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పిన పవన్
- ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబానికి హామీ
జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సోమిశెట్టి మధుసూదన రావు కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన మధుసూదన రావు పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు.
వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన రావు మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలానికి తరలించిన అనంతరం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కావలిలోని వారి నివాసానికి వెళ్లారు. ముందుగా మధుసూదన రావు పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం, మధుసూదన్ కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామనిహామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో పవన్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్ కూడా ఉన్నారు.