JD Vance: భారత పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరిన జేడీ వాన్స్

- నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు
- ప్రధాని మోదీతో చర్చలు
- భారత్ లోని చారిత్రక ప్రదేశాల సందర్శన
- నేడు జైపూర్ నుంచి వాషింగ్టన్ పయనం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇవాళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్‌కు తిరుగు పయనమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాన్స్ వెంట భార్య ఉష వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అనంతరం... వాన్స్ కుటుంబం సోమవారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకుంది. మరుసటి రోజు, మంగళవారం (ఏప్రిల్ 22) నాడు వారు చారిత్రక అంబర్ కోటను సందర్శించారు. అనంతరం జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతపై ప్రసంగించారు.
బుధవారం (ఏప్రిల్ 23) నాడు వాన్స్ కుటుంబం ఆగ్రా నగరాన్ని సందర్శించింది. అక్కడ వారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్ మహల్ అందాలను తిలకించారు. ఆగ్రా పర్యటన అనంతరం వారు తిరిగి జైపూర్ చేరుకున్నారు.
జేడీ వాన్స్ తన భారత పర్యటనను సోమవారం (ఏప్రిల్ 21) ఢిల్లీలో ప్రారంభించారు. తొలుత వారు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం వారు జైపూర్ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్లారు.
ప్రాధాన్యత కోల్పోయిన వాన్స్ పర్యటన!
ఓవైపు, విశిష్ట అతిథి జేడీ వాన్స్ పర్యటన కొనసాగుతున్న తరుణంలోనే జమ్మూకశ్మీర్ లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దాంతో, ఆయన పర్యటన గురించి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. భారత కేంద్ర ప్రభుత్వం కూడా వాన్స్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం తప్పించి, ఇంకెలాంటి ప్రాముఖ్యతను ఇవ్వలేకపోయింది.
సాధారణ పరిస్థితుల్లో అయితే, జేడీ వాన్స్ భారత పర్యటన మీడియాలో ప్రముఖంగా కనిపించేది. కేంద్ర ప్రభుత్వం దృష్టి అంతా ఆయన చుట్టూనే కేంద్రీకృతమై ఉండేది. ఉగ్రదాడి నేపథ్యంలో మీడియా దృష్టి అంతా అటువైపు మళ్లడంతో, జేడీ వాన్స్ పర్యటన వివరాలు కొన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాకే చాలామందికి తెలిసింది.