Seeta Navami: శ్రీరామ నవమి మాత్రమే కాదు... సీతా నవమి కూడా ఉంటుందని తెలుసా?

మనలో చాలామందికి శ్రీరామ నవమి గురించి తెలుసు కానీ, సీతా నవమి కూడా ఉంటుందని తెలియదు. మహా సాధ్విగా పేరుగాంచిన సీతమ్మ తల్లి వారు భూమ్మీద అవతరించిన రోజే సీతా నవమిగా చెలామణీలోకి వచ్చింది. ఈ పవిత్రమైన రోజును హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మే 5వ తేదీన సీతా నవమి వేడుకలు జరగనున్నాయి.
దాంపత్య జీవితంలో సామరస్యం కోసం
సీతా నవమి రోజున శ్రీరాముడిని, సీతాదేవిని భక్తితో ఆరాధించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని, వైవాహిక జీవితంలో సామరస్యం వెల్లివిరుస్తుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా మహిళలు ఈ రోజున సీతాదేవికి పవిత్ర వస్తువులను (గాజులు, కుంకుమ, పూలు వంటివి) సమర్పించడం అత్యంత శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల గృహంలోని సకల దుఃఖాలు, కష్టాల భయాలు తొలగిపోతాయని విశ్వాసం. భార్యాభర్తలు కలిసి ఈ పూజను నిర్వహించడం వల్ల వారి మధ్య ప్రేమ, అనురాగాలు బలపడి, కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని భక్తుల భావన.
వ్యాపారాలకు అనుకూల సమయం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం సీతా నవమి నాడు 'వృద్ధి యోగం', 'వణిజ కరణం' అనే రెండు శుభ యోగాలు సంభవిస్తున్నాయి. వృద్ధి యోగం పేరుకు తగ్గట్టే అభివృద్ధి, విస్తరణకు సూచిక కాగా, వణిజ కరణం వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండు శుభ సమయాల కలయిక వల్ల, సీతా నవమి రోజున వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచిదట. ఈ రోజున ప్రారంభించిన పనులు విజయవంతమై, పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు.
శుభ సమయ వివరాలు
వేద పంచాంగం ప్రకారం, వైశాఖ శుక్ల పక్ష నవమి తిథి మే 5వ తేదీ ఉదయం 7:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు, మే 6వ తేదీ ఉదయం 8:39 గంటలకు ముగుస్తుంది. హిందూ సంప్రదాయంలో సూర్యోదయంతో ప్రారంభమయ్యే తిథిని (ఉదయ తిథి) పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి, సీతా నవమి పండుగను మే 5వ తేదీనే జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున సీతారాములను ఆరాధించి, వారి అనుగ్రహం పొందాలని వారు సూచిస్తున్నారు.