Buggana Rajendranath: జగనన్న పథకాలు ప్రజలకు అందడం లేదు: బుగ్గన

- కూటమి ప్రభుత్వ అప్పులు, సంపద సృష్టిలో స్పష్టత కొరవడిందన్న బుగ్గన
- చంద్రబాబు అనుభవం దృష్ట్యా ప్రజలు నమ్మకం ఉంచారని వ్యాఖ్య
- క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో వెనుకబడి, అప్పులు చేయడంలో మాత్రం ముందుందని వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని, అప్పులు, సంపద సృష్టి విషయంలో స్పష్టత కొరవడిందని అన్నారు.
ప్రభుత్వ అప్పుల లెక్కలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని బుగ్గన పేర్కొన్నారు. అప్పుల గణాంకాలను కొందరు 'మట్కా లెక్కల' మాదిరిగా చెబుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం దృష్ట్యా నమ్మకం ఉంచారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో మద్దతు ఉందని చెప్పుకుంటున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 81,400 కోట్లుగా ఉందని బుగ్గన గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయం, తమ హయాంతో పోలిస్తే 7.5 శాతం తక్కువగా ఉందని, సంపద సృష్టి తగ్గిపోయిందని ఆయన ఆరోపించారు. "సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. ఇదే కూటమి ప్రభుత్వ పనితీరు" అని ఆయన ఎద్దేవా చేశారు.
తాము సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాలన సాగించామని, వైసీపీ అప్పులు చేసిందని విమర్శించే కూటమి ప్రభుత్వం, అంతకంటే ఎక్కువ అప్పులు చేసి ఆ నిధులను ఎవరికి పంచుతోందని ఆయన నిలదీశారు.
జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలైన పథకాలు ప్రస్తుతం ప్రజలకు అందడం లేదని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో, కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హామీలు, పథకాలు కూడా కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సంపద అంతా ఎక్కడికి వెళుతోందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.