Chammak Chandra: నూకలు వండుకు తిన్న రోజులున్నాయి: చమ్మక్ చంద్ర

- 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన చంద్ర
- కెరియర్ మొదట్లో కష్టాల గురించి ప్రస్తావన
- తిరిగి ఊరెళ్లిపోదామని అనిపించేదని వ్యాఖ్య
- అనుకున్నది సాధించానని వెల్లడి
బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్లిన హాస్య నటులలో చమ్మక్ చంద్ర ఒకరుగా కనిపిస్తాడు. 'జబర్దస్త్'తో ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. ఆ తరువాత ఆయన సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెడుతూ వచ్చాడు. 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. " మాది చాలా పూర్ ఫ్యామిలీ .. అందువలన ఇంటి నుంచి వాళ్లు పంపిస్తారనే ఆశ లేదు. అందువలన సిటీలో నా కష్టాలు నేను పడేవాడిని" అని చెప్పాడు.
'జబర్దస్త్'కి ముందు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తున్నా కష్టాలు తీరలేదు. అప్పట్లో కేజీ బియ్యం 10 రూపాయలు ఉండేవి. అందువలన నేను ఆ 10 రూపాయలతో 3 కేజీల నూకలు కొనుక్కునే వాడిని. ఒక్కోసారి ఈ కష్టాలు పడలేక మా ఊరుకు వెళ్లిపోదామని అనిపించేది. కానీ తెలిసినవాళ్లంతా వెక్కిరిస్తారని ఆ పని చేయలేదు. ఆ అవమానం కంటే ఇక్కడ ఇబ్బందులే బెటర్ అనుకునేవాడిని" అని చెప్పాడు.
" ఇండస్ట్రీలో నాకు తెలిసినవాళ్లెవరూ లేరు. ఎవరైనా ఎంకరేజ్ చేస్తారో లేదో కూడా తెలియదు. అయినా మొండిగా వచ్చేశాను. జేబులో డబ్బులు లేకపోయినా నిరాశపడకుండా ప్రయత్నాలు చేశాను. ఒకసారి వెనక్కి వెళితే నేనేనా ఇన్ని కష్టాలు పడింది .. నేనేనా ఇక్కడివరకూ వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పడిన కష్టాలు ఇప్పుడు నాకు చాలా గొప్ప జ్ఞాపకాలుగా అనిపిస్తున్నాయి. నేను అనుకున్నది కొంతవరకూ సాధించగలిగాననే సంతోషం ఉంది" అని అన్నాడు.