Ishan Kishan: మనోడికి మైండ్ పనిచేయలేదు... విచిత్రంగా అవుటైన ఇషాన్ కిషన్!

- ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్ హెచ్ × ముంబయి ఇండియన్స్
- సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్
- బంతి బ్యాట్ కు తగలకపోయినా... అవుటయ్యానని భావించి వెళ్లిపోబోయిన కిషన్
- కాసేపు ఊగిసలాడి చివరికి ఔట్ ఇచ్చిన అంపైర్
- రీప్లేలో బంతి బ్యాట్ కు తగల్లేదని వెల్లడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔటైన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఘటనను తామెప్పుడూ చూడలేదని వ్యాఖ్యాతలు సైతం అవాక్కయ్యారు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికి ఈ అనూహ్య పరిణామం జరిగింది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తుండగా... ముంబయి బౌలర్ వేసిన బంతి లెగ్ సైడ్ వైపు వెళ్లగా, వికెట్ కీపర్ దానిని అందుకున్నాడు. అంతా సాధారణంగానే ఉందనిపించినా, అనూహ్యంగా ఇషాన్ కిషన్ పెవిలియన్ వైపు నడవడం ప్రారంభించాడు. అయితే, మధ్యలోనే ఆగిపోయాడు. అదే సమయంలో ముంబై ఆటగాళ్లు క్యాచ్ కోసం అప్పీల్ చేశారు. అప్పటికే పాక్షికంగా చేయి పైకి లేపిన అంపైర్ కాసేపు ఊగిసలాడి, చివరికి ఇషాన్ కిషన్‌ను ఔట్‌గా ప్రకటించాడు.
కానీ, అసలు ట్విస్ట్ రిప్లేలో కనిపించింది. అల్ట్రా ఎడ్జ్ పరిశీలనలో బంతి ఇషాన్ కిషన్ బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదని స్పష్టంగా తేలింది. కిషన్ ముందే నడవడం ప్రారంభించడం, అంపైర్ ఔటివ్వడం, ఆ తర్వాత రిప్లేలో నాటౌట్ అని తేలడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. కిషన్ అయోమయానికి గురై, బంతి బ్యాట్‌కు తగిలిందని భావించి మైదానం వీడబోయినట్లు వీడియోలో కనిపించింది.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇషాన్ కిషన్ కు మతిపోయినట్టుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి మ్యాచ్ ఫిక్సయిందనడానికి ఇదే నిదర్శనమని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.