Smitha Sabarwal: ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా!: స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు

- స్మితా సబర్వాల్‌పై మండిపడిన గజ్జెల కాంతం
- బాధ్యత కలిగిన అధికారిణి అయి ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతావా అని ఆగ్రహం
- కేసీఆర్ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీత
- పదేళ్లు కేసీఆర్ పక్కనే పదవిలో ఉన్నారని గుర్తు చేసిన గజ్జెల కాంతం
- స్మితా సబర్వాల్ హెలికాప్టర్‌లో తిరిగారంటూ నిప్పులు
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ, జీతం తీసుకుంటూ, బాధ్యతాయుతమైన అధికారిణిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. "ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా... ఆమె ఐఏఎస్ అధికారిణి!" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఒక పోస్టు పెట్టడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఎలా పోస్ట్ పెట్టారని ప్రశ్నిస్తూ గజ్జెల కాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు కేసీఆర్ పక్కనే (కీలక పదవిలో) ఉండి, ఆ సమయంలో ఏ విషయంలోనూ నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికివేసిందని, అడవులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. అప్పుడు జింకలు, ఇతర వన్యప్రాణులు ఇతర అడవులకు తరలిపోయాయని, ఆ సమయంలో ఆమె ఏం చేశారని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి కూడా ఆమె ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. అప్పుడు 'ఎక్స్'లో ఎందుకు పోస్టు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్‌లు హెలికాప్టర్‌లో తిరిగితే, స్మితా సబర్వాల్ కూడా మరో హెలికాప్టర్‌లో తిరిగారని ఆయన వ్యాఖ్యానించారు.