Asaduddin Owaisi: మజ్లిస్ వర్సెస్ బీజేపీ... ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

- 77.56 శాతం నమోదైన ఓటింగ్
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
- ఈ నెల 25న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 77.56 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ప్రజాప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరగనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
బీజేపీ గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్, మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లకు గాను 66 మంది, 31 మంది ఎక్స్-అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. మజ్లిస్ పార్టీ తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ తరఫున గౌతమ్ రావు పోటీ చేస్తున్నారు.