Aghori: మహిళకు టోకరా వేసిన కేసులో అఘోరీకి రిమాండ్

- పూజల పేరుతో మహిళ నుంచి రూ.10 లక్షలు వసూలు
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- అఘోరీని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ప్రత్యేక పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి మోసగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అఘోరీకి చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకుని, అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు.
వివరాల్లోకి వెళితే, ఓ మహిళ తన సమస్యల పరిష్కారం కోసం అఘోరీని ఆశ్రయించారు. ప్రత్యేక పూజలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మించిన అఘోరీ, సదరు మహిళ నుంచి దశలవారీగా సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఎంతకాలమైనా తన సమస్యలు తీరకపోవడం, అఘోరీ ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు, వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, అఘోరీకి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని, తాను పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది.
కాగా, అఘోరీ ఇటీవల వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరినీ పోలీసులు మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండగా గుర్తించారు. అఘోరీని అదుపులోకి తీసుకుని నార్సింగి పీఎస్ కు తరలించారు. మరోవైపు, వర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్ కు తరలించినట్టు తెలుస్తోంది.