Sreenidhi Shetty: ఇక నాకు తెలుగు వచ్చేసినట్టే: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి

- శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3'
- నానితో జోడీ కట్టిన శ్రీనిధి శెట్టి
- మే 1న విడుదలవుతున్న సినిమా
- ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నానన్న బ్యూటీ
హీరో నాని, 'కేజీఎఫ్' ఫేమ్ నటి 'శ్రీనిధి శెట్టి' జంటగా నటించిన 'హిట్ 3' చిత్రం మే 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా నాని, శ్రీనిధి శెట్టి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు మొదట్లో కొంత ఆందోళన చెందానని, అయితే నేచురల్ స్టార్ నానితో కలిసి పనిచేయడం ప్రారంభించాక ఆ వాతావరణం ఎంతో సౌకర్యవంతంగా మారిందని కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడం గురించి మాట్లాడుతూ, 70 శాతం భాషపై పట్టుసాధించానని అనుకుంటున్నాననీ... తెలుగు శబ్దాలు, సంభాషణలు వినడానికి చాలా బాగున్నాయని అన్నారు. నాని, చిత్ర బృందం సహాయంతో వేగంగా తెలుగు నేర్చుకోగలిగానని వివరించారు.
ఇక నానీ మాట్లాడుతూ... శ్రీనిధి అంకితభావాన్ని, భాషను వేగంగా నేర్చుకుంటున్న తీరును ప్రశంసించారు. ఆమె ఉత్సాహం, సెట్‌కు కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రధానంగా నటుడిగానే తన బాధ్యత నిర్వర్తించానని స్పష్టం చేశారు. సాధారణంగా తాను కథతో మమేకమై ప్రయాణించడానికి ఇష్టపడతాననీ, కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడి ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచి నటనపైనే దృష్టి సారించానని చెప్పారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.