Moulana Shahbuddin Razvi Barelvi: పహల్గామ్ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర: తీవ్రంగా ఖండించిన మౌలానాలు

- పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రముఖ మౌలానాలు
- దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపణ
- ఉగ్రవాద చర్యలు ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టీకరణ
- బాధితులకు సంఘీభావం... దోషులపై కఠిన చర్యలకు ప్రభుత్వానికి పిలుపు
- ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఘటనను మతానికి ముడిపెట్టవద్దని విజ్ఞప్తి
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఇద్దరు ప్రముఖ మౌలానాలు తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలే కారణమని వారు ఆరోపించారు.
పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎంజే) జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్రంగా ఖండించారు. ఇది ఇస్లాంకు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని ఆయన అన్నారు. పేర్లు అడిగి మరీ దాడి చేయడం ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని, ఏ మతమూ ఇలాంటి హింసను అనుమతించదని స్పష్టం చేశారు.
ఉగ్రవాద సంస్థలకు ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని, పాకిస్థాన్ వాటికి ఆశ్రయం కల్పిస్తూ, మద్దత్తునిస్తోందని మౌలానా షహబుద్దీన్ ఆరోపించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని, ఉగ్రవాదం విషయంలో ఆ దేశ నిజస్వరూపాన్ని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ బయటపెట్టాలని ఆయన కోరారు. మతం పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని, భారతీయ ముస్లింలు ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని, బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తారని తెలిపారు.
ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా అధిపతి మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ కూడా ఈ దాడిని ఖండించారు. ఉగ్రవాదానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆస్కారం లేదని స్పష్టం చేశారు. బాధితుల కోసం తమ మదర్సాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను ఏ మతానికీ, వర్గానికీ ముడిపెట్టవద్దని, ఉగ్రవాది కేవలం ఉగ్రవాదేనని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎప్పుడూ దేశంతోనే ఉంటామని ఆయన పునరుద్ఘాటించారు.