Dileesh Pothan: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్!

- మలయాళంలో రూపొందిన 'అం అహః'
- మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ప్రధానమైన పాత్రను పోషించిన దిలీష్ పోతన్
- ఆసక్తిని రేపుతున్న కంటెంట్
మలయాళంలో ఈ మధ్య కాలంలో విడుదలైన విభిన్నమైన సినిమాలలో 'అం అహః' ఒకటి. జనవరి 24వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. దిలీష్ పోతన్ .. దేవదర్శిని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, థామస్ కె సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది.
మలయాళంలో దిలీష్ పోతన్ కి మంచి పేరు ఉంది. ఇక దేవదర్శిని తమిళ .. మలయాళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అలాంటి వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోందని తెలుస్తోంది. లొకేషన్స్ కి .. ఫొటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు.
కథ విషయానికి వస్తే .. స్టీఫెన్ రోడ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. తనకి అప్పగించిన పనిని పూర్తిచేయడం కోసం అతను ఓ కొండప్రాంతానికి వెళతాడు. అడవికి సమీపంలోని ఆ గ్రామంలో చిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్టుగా అతని దృష్టికి వస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. త్వరలోనే ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.