Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో కాజల్ అగర్వాల్ కు నిరాశ

- ఈద్ సందర్భంగా విడుదలైన సల్మాన్ సినిమా 'సికందర్'
- సల్మాన్, కాజల్ మధ్య ఉన్న కీలక సన్నివేశం తొలగించిన మేకర్స్
- బలమైన సందేశాన్నిచ్చే సన్నివేశాన్ని ఎందుకు తొలగిచారంటున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల నటించిన 'సికందర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి, ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నప్పటికీ... ఈ సినిమా కథనం, స్క్రీన్‌ప్లే పరంగా విమర్శకుల నుంచి పెదవి విరుపులు ఎదుర్కొంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి తొలగించిన ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశంలో అందాల భామ కాజల్ అగర్వాల్ కూడా ఉండటం విశేషం.
ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా ఎక్స్ వేదికలో ప్రత్యక్షమైన ఈ వీడియోలో, కాజల్ అగర్వాల్ పోషించిన పాత్ర తన సంకుచిత భావాలు గల మామగారు, భర్త పెట్టే ఇబ్బందులతో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. అయితే, అదే సమయంలో సల్మాన్ ఖాన్ పాత్ర ఆమెను కాపాడుతుంది. అనంతరం, జీవితం ఎంత విలువైందో వివరిస్తూ, ఆమె అత్తమామల ఆలోచనా విధానం మారాలని హితవు పలికేలా సంభాషణ సాగుతుంది.
ఈ తొలగించిన సన్నివేశం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న, బలమైన సందేశాన్నిచ్చే సన్నివేశాన్ని సినిమా ఫైనల్ కట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మహత్యల నివారణకు ఇలాంటి సన్నివేశాలు ఎంతో అవసరం. ఎంతో అందంగా చిత్రీకరించారు. సల్మాన్ చెప్పిన విధానం బాగుంది. దీన్ని ఎందుకు తొలగించారు?" అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
మరొక నెటిజన్, "ఈ సీన్‌ను ఎడిటింగ్‌లో ఎందుకు తీసేశారు? అని ప్రశ్నించారు. ప్రజలు చూడాల్సిన ముఖ్యమైన సన్నివేశం ఇది. ఎందుకింత పేలవమైన ఎడిటింగ్? అని అడిగారు. ఇలాంటి అభిప్రాయాలే మరికొందరు వ్యక్తం చేస్తూ, ఈ సన్నివేశం సినిమాలో ఉండి ఉంటే మరింత ప్రభావవంతంగా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'సికందర్' చిత్రం ఈద్ సందర్భంగా విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్, కాజల్ అగర్వాల్‌తో పాటు రష్మిక మందన్న, సత్యరాజ్, శర్మన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ తొలగించిన సన్నివేశంపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.