Kashmir Terrorist Attack: కశ్మీర్ లో ముష్కరుల కోసం కొనసాగుతున్న భారీ వేట..

- పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత
- భద్రతా బలగాల భారీ మోహరింపు, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు
- ఘటనను ఖండిస్తున్న అంతర్జాతీయ సమాజం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయను భయాందోళనల్లో ముంచెత్తింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లోనే నక్కి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దాడి జరిగినప్పటి నుంచి కశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ, ఉగ్రమూకల కోసం వేట కొనసాగిస్తున్నాయి. దాడిలో సుమారు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని, వీరిలో 5 నుంచి 7 మంది పాకిస్థాన్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దాడి సమయంలో ఉగ్రవాదులు కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారని, మహిళలు, చిన్నారుల జోలికి వెళ్లలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తుల గుర్తింపు కార్డులను పరిశీలించి, వారి మత వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతే కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్ దేశాలకు చెందిన ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధృవీకరించారు.
ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, పాక్ వైమానిక దళాలు సరిహద్దుల వైపు కదులుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడారు.