Nandamuri Balakrishna: బాలయ్య 'అఖండ 2'లో విజయశాంతి?

- బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అఖండ' సీక్వెల్
- కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించిన బోయపాటి
- విజయశాంతి సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో 'అఖండ 2' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో బాలకృష్ణ సరసన కథానాయికగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన, శక్తివంతమైన రాజకీయ నాయకురాలి పాత్ర కోసం సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల ఆమెను కలిసి కథ, పాత్ర ప్రాముఖ్యతను వివరించారని, పాత్ర నచ్చడంతో నటించేందుకు విజయశాంతి సుముఖత వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, చాలా కాలం తర్వాత విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండటం విశేషం.
ఇదిలా ఉండగా, సినిమా షూటింగ్ దశలో ఉండగానే పలు ఏరియాల్లో బిజినెస్ డీల్స్ పూర్తయినట్లు సమాచారం. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక స్థాయిలో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. నెల రోజుల పాటు జరిగే కీలకమైన షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళ్లనుంది. మే నెల మొత్తం అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా, జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అధికారిక ప్రకటనల కోసం అభిమానులు వేచిచూస్తున్నారు.