: పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. పాక్ గగనతలాన్ని తప్పించి ఢిల్లీకి మోదీ విమానం

- జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ సౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగింపు
- తిరుగు ప్రయాణంలో పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించని ప్రధాని ప్రత్యేక విమానం
- సౌదీ వెళ్లేటప్పుడు ఇదే మార్గాన్ని ఉపయోగించినట్లు వెల్లడి
- ఢిల్లీ చేరుకున్న వెంటనే అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహణ
- ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలేది లేదని ప్రధాని స్పష్టీకరణ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన భారత్‌కు తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, సౌదీలోని జెడ్డా నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ప్రధాని విమానం పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించకుండా అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మంగళవారం సౌదీ అరేబియా వెళ్లేందుకు ఇదే విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగానే ప్రయాణించింది. కానీ, పహల్గామ్‌లో ఉగ్రదాడి వార్త తెలిసిన వెంటనే ప్రధాని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సమయం ఆదా చేయడం, అనుమతుల ప్రక్రియను నివారించడం వంటి కారణాలతో పాటు, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని వాడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన స్థానిక విభాగం 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఈ దాడికి బాధ్యత వహించింది.
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం కూడా జరిగింది. దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో తమ సంకల్పం మరింత బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.