Putin: పహల్గాం ఉగ్రదాడిపై పుతిన్ స్పందన

- పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- సంతాప సందేశం పంపిన పుతిన్
- చనిపోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి
జమ్మూకశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. కశ్మీర్ అందాలను చూడటానికి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది మరణించారు. ఈ ఘటనపై వివిధ దేశాధినేతలు, ప్రముఖులు స్పందిస్తూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు సంతాప సందేశం పంపారు. "ఈ దారుణమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షిస్తారని ఆశిస్తున్నాను. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని పుతిన్ పేర్కొన్నారు.