JD Vance: తాను భారత్ లో పర్యటిస్తుండగానే ఉగ్రదాడి జరగడం పట్ల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందన

- జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో భీకర ఉగ్రదాడి
- 26 మంది వరకు ఉగ్ర ఘాతుకానికి బలి
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జేడీ వాన్స్
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్‌లో మంగళవారం నాడు జరిగిన భీకర ఉగ్రదాడి పట్ల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు తన తరపున, తన భార్య ఉష తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తాము భారతదేశంలో పర్యటిస్తున్నామని వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశపు అనిర్వచనీయమైన సౌందర్యం, ఇక్కడి ప్రజల ఆత్మీయత తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. "గత కొద్ది రోజులుగా మేము ఈ దేశం, ఇక్కడి ప్రజల అందంతో ఎంతగానో ప్రభావితమయ్యాం" అని వాన్స్ వ్యాఖ్యానించారు.
అయితే, ఇంతటి అందమైన దేశంలో ఇలాంటి ఘోరమైన ఉగ్రదాడి జరగడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ భయానక దాడితో దుఃఖంలో ఉన్న వారికి మా ప్రార్థనలు అండగా ఉండాలని కోరుకుంటున్నాం" అని జేడీ వాన్స్ తెలిపారు. బాధితుల కుటుంబాలు త్వరగా ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఈ తీవ్రవాద చర్య నేపథ్యంలో భారత ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు వాన్స్ వెల్లడించారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ను వాన్స్ పంచుకున్నారు.