TRF: టీఆర్ఎఫ్... కశ్మీర్ లో నరమేధానికి చిరునామా!

- దక్షిణ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి
- దాదాపు 25 మంది మరణించినట్టు సమాచారం
- దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్న టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ
దాదాపు 25 మంది వరకు నేలకొరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ప్రకటించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 ఆగస్టులో ఈ సంస్థ వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా (LeT)కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ, కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఏర్పడిందని భావిస్తున్నారు. ఏర్పాటైన ఆరు నెలల్లోనే వివిధ ఉగ్రవాద సంస్థల సభ్యులను తన గొడుగు కిందకు చేర్చుకుంది.
సోషల్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం చేస్తూ, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తోందన్న కారణాలతో భారత హోం మంత్రిత్వ శాఖ (MHA) 2023 జనవరిలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద TRFను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 2019 అక్టోబర్‌లో స్థాపించబడిన ఈ సంస్థకు షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ దార్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరించారు.
ప్రారంభంలో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా కేడర్‌లతో ఏర్పడిన TRF, అప్పటి నుంచి కాశ్మీరీ హిందువులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, పర్యాటకులు, పోలీసులతో సహా పలువురిని లక్ష్యంగా చేసుకుంటోంది. TRF లష్కరే తోయిబాకు ముసుగు సంస్థగా పనిచేస్తోందని భారత ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. కాశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా, సులభంగా దాడులు చేయగల 'సాఫ్ట్ టార్గెట్లను' ఈ సంస్థ లక్ష్యంగా చేసుకుంటోంది.
పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 2018లో 'గ్రే లిస్ట్'లో చేర్చిన తర్వాత, లష్కరే తోయిబా నుంచి అంతర్జాతీయ దృష్టిని మరల్చేందుకు పాక్ గూఢచార సంస్థ ISI వ్యూహాత్మకంగా TRFను సృష్టించిందని ఓ బలమైన వాదన ప్రచారంలో ఉంది.
TRF... ఆది నుంచి హింసాత్మక చరిత్రే!
పర్యాటకులు, మైనారిటీ కాశ్మీరీ పండిట్లు, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకోవడంలో TRF కు పేరుంది. గందర్‌బల్ జిల్లాలోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఈ బృందం జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ వైద్యుడు, పలువురు కార్మికులు, కాంట్రాక్టర్‌తో సహా ఏడుగురు మరణించారు. 2020 ఏప్రిల్ 1న కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (LoC) సమీపంలో TRFకు, భద్రతా బలగాలకు మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన భీకర పోరులో ఐదుగురు భారత పారా కమాండోలు వీరమరణం పొందగా, ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
లష్కరే తోయిబాతో సంబంధాలున్న సజిద్ జాట్, సజ్జాద్ గుల్, సలీం రెహ్మానీ వంటి కీలక ఉగ్రవాదులు TRFతో సంబంధం కలిగి ఉన్నారు. అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ గ్రూపు కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.