Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసానికి సమీపంలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కేంద్రమంత్రి

- ముర్షిదాబాద్ బాధితుల సహాయార్థం నిధులు సేకరించేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నం
- మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోని హజ్రా మోర్ వద్ద ఘటన
- బీజేపీ నేతలు అనుమతి తీసుకోలేదని తెలిపిన సీనియర్ పోలీసు అధికారి
ముర్షిదాబాద్ హింసాత్మక ఘటనల బాధితుల సహాయార్థం నిధులు సేకరించేందుకు ప్రయత్నించిన కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను రాష్ట్ర పోలీసులు కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో కోల్‌కతాలోని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోని హజ్రా మోర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో సుకాంత మజుందార్ మీడియాతో మాట్లాడుతూ, ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకు తాము నిధుల సేకరణ చేపట్టామని తెలిపారు. బాధితుల కోసం నిధులు అడగడం నేరమా? మేము నిరసన తెలియజేయకూడదా? అని ప్రశ్నించారు. ఇది తమ ప్రాథమిక హక్కు అని అన్నారు.
ఈ ఘటనపై ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ, ఇది అత్యంత భద్రత కలిగిన ప్రాంతమని, ఇక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. బీజేపీ నేతలు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, అందుకే వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. భద్రతా కారణాల రీత్యానే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.