Padmanabham: ఎన్టీఆర్ కంటే సావిత్రిగారు తీసుకున్న పారితోషికమే ఎక్కువ: పద్మనాభం సోదరుడు!

- పద్మనాభం చాలా యాక్టివ్ గా ఉండేవారు
- ఆయనను కన్నాంబ ఆదరించారు
- 'పాతాళభైరవి'తో బిజీ అయ్యారు
- నిర్మాతగా 'దేవత' పెద్ద హిట్ అని చెప్పిన పురుషోత్తమరావు
తెలుగు తెరపై హాస్యాన్ని పరిగెత్తించిన తొలితరం నటులలో పద్మనాభం ఒకరు. నటుడిగానే కాదు నిర్మాతగానూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. పద్మనాభం సొంత సినిమాల నిర్మాణానికి సంబంధించిన విషయాలను ఆయన సోదరుడైన పురుషోత్తమరావు చూసుకునేవారు. ప్రస్తుతం పురుషోత్తమరావు పులివెందుల సమీపంలోని 'సింహాద్రిపురం'లో ఉంటున్నారు. అలనాటి పాత జ్ఞాపకాలను ఆయన 'ఊరు వాడ' యూ ట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు.
"మేము ఐదుగురం అన్నదమ్ములం. మా అన్నయ్యకి 14 ఏళ్లు ఉన్నప్పుడు నాకు 9 ఏళ్లు. తను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడు. మద్రాస్ వెళ్లిన అన్నయ్యను ముందుగా ఆదరించింది 'కన్నాంబ' దంపతులే. 'మాయా లోకం' సినిమాతో నటుడిగా పరిచయమైన ఆయనకి, 'పాతాళ భైరవి' సినిమాతో గుర్తింపు వచ్చింది. అలా ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. మా అందరి పెళ్లిళ్లు చేసి సెటిల్ చేసింది ఆయనే" అని అన్నారు.
"మా అన్నయ్య నన్ను నిర్మాతగా పెట్టి కొన్ని సినిమాలు నిర్మించాడు. వాటిలో 'దేవత' ఒకటి. ఆ సినిమా కోసం పారితోషికంగా ఎన్టీఆర్ 40 వేలు తీసుకోగా... సావిత్రి గారు 60 వేలు తీసుకున్నారు. అప్పట్లో ఆ సినిమాను 5 లక్షలలో పూర్తిచేశాము. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే" అని చెప్పారు.