Pradeep: విజయశాంతి గారికి ఫుల్ ఫీవర్.. అయినా బురదగుంట సీన్ చేశారన్న డైరెక్టర్!

- ఆ పాత్ర విజయశాంతిగారి కోసం రాసిందే
- ఆమె డూప్ లేకుండా ఫైట్స్ చేశారు
- ఫీవర్ ఉన్నప్పటికి మాకు చెప్పలేదు
- అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అన్న దర్శకుడు
క్రితం వారం విడుదలైన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి... కల్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా గురించిన అనేక విషయాలను పంచుకున్నారు.
"ఈ కథను రాసుకుంటున్నప్పుడే వైజయంతి పాత్రకి విజయశాంతి గారిని అనుకుని రాసుకోవడం జరిగింది. ఒకవేళ ఆమె చేయనంటే ఈ కథను పక్కన పెట్టేయాలని అనుకున్నాం. అదే విషయాన్ని విజయశాంతి గారితో చెప్పాము. తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొద్దని ఆమె అనేవారు. సెట్లో విజయశాంతి - కల్యాణ్ రామ్ లను చూస్తే, తల్లీ కొడుకుల మాదిరిగానే అనిపించేవారు. ఆ పాత్రలను గురించి వారు చర్చించుకోవడమే అందుకు కారణమనుకోవచ్చు" అని అన్నారు.
"విజయశాంతిగారు డూప్ వద్దన్నారు.. ఫైట్స్ ఆమెనే చేశారు. ఫారెస్టులో కాల్పుల సమయంలో బురదగుంటలో ఆమె పడిపోయే సీన్ ఉంది. ఆమెనే దొర్లుతూ వెళ్లి బురదగుంటలో పడ్డారు. ఆ బురదగుంటలో తడుస్తూ షాట్ పూర్తయ్యేవరకూ అలాగే ఉన్నారు. ఆ షాట్ ను పూర్తి చేయడానికి రెండు గంటలపైన పట్టింది. ఆమెకి మూడు రోజుల నుంచి ఫీవర్ అనే విషయం అప్పుడు చెప్పారు. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అయ్యేరనే విషయం అప్పుడు అర్థమైంది నాకు" అని వివరించారు.