Sajjanar: అలా రుణాలు ఇచ్చే యాప్‌ల ఉచ్చులో చిక్కుకోవద్దు: సజ్జనార్ హెచ్చరిక

- ఆకర్షణీయ ప్రకటనలతో రుణ యాప్‌ల నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడి
- రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారన్న సజ్జనార్
- రుణం చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వెల్లడి
- యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన
- వేధింపులకు గురైతే భయపడకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచన
రుణాలిచ్చే యాప్‌ల ఉచ్చులో చిక్కుకోవద్దని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన ట్వీట్ చేశారు. రుణ యాప్ నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలని ఏమారుస్తున్నారని పేర్కొన్నారు.
లోన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫోన్ కాంటాక్టులు, గ్యాలరీ ఫొటోలు, ఇతర వివరాలను సేకరించి, రుణం చెల్లించలేని పరిస్థితులు వచ్చినప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారని తెలిపారు. దీంతో ఎంతోమంది మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లోన్ యాప్స్ నిర్వహకులు వేధింపులకు గురిచేస్తే భయపడవద్దని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏం చేయలేమనే ఆందోళనకు గురికావొద్దని ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఒక వార్తా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతపరిచారు.