UPSC Results 2024: యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు... టాప్-10 జాబితా ఇదే!

Telugu Students Shine in UPSC 2024 Results

  • యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2024 తుది ఫలితాలు విడుదల
  • దేశవ్యాప్తంగా మొత్తం 1009 మంది అభ్యర్థులు ఎంపిక
  • తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు 
  • ఇ. సాయి శివానికి 11వ ర్యాంక్, బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంక్

దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా, జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 160 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఎంపికయ్యారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) సహా 25కు పైగా సర్వీసుల్లోని వెయ్యికి పైగా పోస్టులు ఉన్నాయి.

ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల అనంతరం మొత్తం 2,845 మంది అభ్యర్థులు తుది దశగా జరగనున్న ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో భాగంగా 2024 జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, జులై 1న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను డిసెంబర్‌లో ప్రకటించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి 2025 జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు రెండు సెషన్లలో ఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.

ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. సాయి శివాని 11వ ర్యాంకుతో సత్తా చాటారు. బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు, శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చౌతన్య జాదవ్ 68వ ర్యాంకు, ఎన్. చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంకు సాధించారు.

జాతీయస్థాయిలో టాప్ 10 ర్యాంకర్ల జాబితాను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. వారిలో శక్తి దుబే, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠి ఉన్నారు.

UPSC Results 2024
UPSC Toppers
Telugu Students UPSC
E Sai Shivani
Banna Venkatesh
Abhishek Sharma
UPSC Civil Services Exam
IAS
IPS
IFS
Top 10 Rankers UPSC
  • Loading...

More Telugu News