Chandrababu Naidu: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు... కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ

- పోలవరం నిధులు, బనకచర్ల అనుమతులపై చర్చ
- ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరిన చంద్రబాబు
- జలశక్తి మంత్రికి పోలవరం, బనకచర్లపై సీఎం వినతి
విదేశీ పర్యటనను ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కాసేపటి క్రితం సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరులు ఉన్నారు.
సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల, పనుల పురోగతిపై చర్చించినట్లు సమాచారం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం, పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
అలాగే, రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడంలో కీలకమైన బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా తరలించి, పెన్నా నదితో అనుసంధానించే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం లభిస్తే రాయలసీమ నీటి కష్టాలు తీరతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది.