Prithvi Actor: అప్పుడు ఇచ్చింది అంత .. ఇప్పుడు ఇచ్చింది ఇంత: నటుడు పృథ్వీ

- ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను
- హీరో కావాలని నాకూ ఉండేది
- నందమూరి హీరోలతో కలిసి నటించడం అదృష్టం
- 'పెళ్లి' సినిమాకి అందుకున్న పారితోషికం 50 వేలు
పృథ్వీ .. 'పెళ్లి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆయన 'బబ్లూ' అనే పాత్రను పోషించారు. అప్పటి నుంచి ఆయనను అంతా 'బబ్లూ' పృథ్వీ అనే అంటారు. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఇప్పుడు బిజీ. ఇటీవల 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలో ఆయన చేసిన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మొదటి నుంచి కూడా ఫిట్ నెస్ పై నేను ఎక్కువగా దృష్టిపెట్టేవాడిని. మంచి కలర్ ఉంటాను .. ఒక రకంగా చెప్పాలంటే అందగాడినే. అందువలన నాకు కూడా హీరోను కావాలనే కోరిక ఉండేది. ఆ దిశగా ప్రయత్నాలు చేశాను కూడా. కానీ కాలం కలిసి రాలేదు. ఆ సినిమాలు మొదలుకాకపోవడమో .. మధ్యలో ఆగిపోవడమో జరుగుతూ వచ్చింది. అందువలన వచ్చిన అవకాశాలను నేను ఉపయోగించుకుంటూ వెళ్లడం మొదలుపెట్టాను" అని అన్నారు.
"నేను ఎక్కువగా బాలకృష్ణగారితో చేశాను. ఆయన అంకితభావం ప్రత్యక్షంగా చూశాను గనుక ఆయనను ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాను. ఎన్టీఆర్ లోను .. కల్యాణ్ రామ్ లోను అదే క్రమశిక్షణ చూశాను. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నా మొదటి సినిమా అయిన 'పెళ్లి'కి నేను అందుకున్న పారితోషికం 50 వేలు అయితే, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' కోసం నేను తీసుకున్నది 50 లక్షలు. ఇంతవరకూ నేను తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ ఇదే" అని చెప్పారు.