Anushakaban: గాజువాకలో నేపాల్ అమ్మాయి... తల్లిదండ్రులకు అప్పగింత!

- గాజువాక చేరిన నేపాల్ యువతి
- యువతి తండ్రి ఫిర్యాదుతో నేపాల్‌లో మిస్సింగ్ కేసు నమోదు
- సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాజువాకలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
- నేపాల్ పోలీసుల సమక్షంలో ఆమె తండ్రికి యువతిని అప్పగించిన గాజువాక పోలీసులు
నేపాల్ రాజధాని ఖాట్మండులో అదృశ్యమైన ఓ యువతి విశాఖ జిల్లా గాజువాకలో ప్రత్యక్షమైంది. ఆమెను గాజువాక పోలీసులు ఆమె తండ్రికి అప్పగించారు. ఈ మేరకు సౌత్ ఏసీపీ త్రినాథ్ వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన అనుషకబం (22) అనే యువతి పీజీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేపాల్ పోలీసులు సాంకేతిక సహాయంతో ఆమె విశాఖ జిల్లా గాజువాకలో ఉన్నట్లు గుర్తించారు. బాలిక తండ్రితో కలిసి నేపాల్ పోలీసులు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని కలిశారు. సీపీ ఆదేశాల మేరకు సౌత్ ఏసీపీ టి. త్రినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆమె సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాజువాకలోని తుంగ్లాంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గాజువాక ఎస్ఐ నజీర్ ఆమెను బాలిక తండ్రికి అప్పగించారు.
ఒడిశాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో పరిచయం పెంచుకుని ఖాట్మండుకు వెళ్లి యువతిని గాజువాక తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని, నేపాల్‌లో నమోదయిన మిస్సింగ్ కేసు ఆధారంగా యువతిని గుర్తించి తండ్రికి అప్పగించామని ఏసీపీ త్రినాథ్ మీడియాకు తెలిపారు. కేసు నమోదు వ్యవహారం నేపాల్ పోలీసులు చూసుకుంటారని ఆయన వెల్లడించారు.