Kodali Nani: కొడాలి నాని హెల్త్ అప్డేట్ ఇదిగో!

- ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కొడాలి నాని
- మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలింపు
- ప్రస్తుతం హైదరాబాద్ లోని రిహాబిలిటేషన్ సెంటర్లో నాని
టీడీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొడాలి నాని... మాటతీరుతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును సైతం అత్యంత నీచమైన పరుష పదజాలంతో దూషించిన చరిత్ర కొడాలిది.
ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో కొడాలి నాని సైలెంట్ అయిపోయారు. వల్లభనేని జైల్లో రిమాండ్ లో ఉన్నప్పుడు జగన్ తో కలిసి ఒకసారి కనిపించారు. ఇదే సమయంలో ఆయనపై ఒక కేసు కూడా నమోదయింది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో అడ్మిట్ కావడం... ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఎయిర్ అంబులెన్సులో ముంబైకి వెళ్లడం అందరికీ తెలిసిందే. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆయనకు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హార్ట్ రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కొడాలి నాని ఆరోగ్యం ఎలా ఉంది? అనేది కేవలం వైసీపీ శ్రేణులకే కాదు... అన్ని పార్టీల వారికి ఆసక్తికరమే. కొడాలి నాని ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఆయన ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు.