Shivangini Mangla: "బయట చూసుకుందాం"... కోర్టు హాలులో మహిళా జడ్జికి నిందితుడి బెదిరింపులు

- ఢిల్లీ ద్వారకా కోర్టులో మహిళా జడ్జికి బెదిరింపులు
- చెక్ బౌన్స్ కేసులో నిందితుడిని దోషిగా తేల్చడంతో ఘటన
- నిందితుడు, అతని లాయర్ జడ్జిని దూషించి, రాజీనామా చేయాలని డిమాండ్
- విషయాన్ని హైకోర్టుకు నివేదించిన జడ్జి, లాయర్‌కు షోకాజ్ నోటీసు
చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తిని దోషిగా నిర్ధారించినందుకు ఢిల్లీకి చెందిన మహిళా జడ్జికి కోర్టు హాలులోనే తీవ్ర అవమానం, బెదిరింపులు ఎదురయ్యాయి. ద్వారకా కోర్టులో ఏప్రిల్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యాయమూర్తి శివాంగి మాంగ్లా చెక్ బౌన్స్ కేసులో నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో ఆగ్రహించిన నిందితుడు, అతని తరఫు న్యాయవాది అతుల్ కుమార్ కోర్టు హాలులోనే జడ్జిపై విరుచుకుపడ్డారు. "నువ్వెంత? బయట కలువు, ఎలా ఇంటికి ప్రాణాలతో వెళతావో చూస్తాం" అంటూ నిందితుడు జడ్జిని తీవ్రస్థాయిలో బెదిరించాడు. అంతేకాకుండా, జడ్జి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఆమెపై ఫిర్యాదు చేసి బలవంతంగా రాజీనామా చేయిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జడ్జి శివాంగి మాంగ్లా, నిందితుడు, అతని లాయర్ తనను మానసికంగా, శారీరకంగా వేధించారని, ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించకపోతే ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తదుపరి చర్యల నిమిత్తం జిల్లా సెషన్స్ జడ్జి ద్వారా ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కూడా కోరారు.
అంతేకాకుండా, నిందితుడి తరఫు న్యాయవాది అతుల్ కుమార్ ప్రవర్తనపై జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో అనుచితంగా ప్రవర్తించినందుకు, ఎందుకు క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 5న చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలిన నిందితుడికి జడ్జి శివాంగి మాంగ్లా 22 నెలల జైలు శిక్షతో పాటు రూ. 6.65 లక్షల జరిమానా విధించారు. కోర్టు హాలులోనే న్యాయమూర్తికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.