Padmini: అక్కడ డీలాపడిన లవ్ స్టోరీకి ఇక్కడ ఇంత దూకుడా?

- మలయాళంలో రూపొందిన 'పైంకిలి'
- కొత్త పాయింటును టచ్ చేసిన డైరెక్టర్
- థియేటర్స్ నుంచి అంతగారాని రెస్పాన్స్
- 'మనోరమా మ్యాక్స్'లో దూసుకుపోతున్న కంటెంట్
సాధారణంగా మలయాళ సినిమాలు బడ్జెట్ తక్కువ... కథాబలం ఎక్కువ అన్నట్టుగా ఉంటాయి. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమాలు, వందల కోట్ల లాభాలను తేలికగా తెచ్చిపెడుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి మాత్రం లెక్క తప్పుతూ ఉంటుంది. అలాంటి సినిమాల జాబితాలో ఒకటిగా కనిపించేదే 'పైంకిలి'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా, ఏప్రిల్ 11 నుంచి 'మనోరమా మ్యాక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాలో, అనశ్వర రాజన్ - సాజిత్ గోపు ప్రధానమైన పాత్రలను పోషించారు. శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 6 కోట్ల వసూళ్లనే రాబట్టింది. అలాంటి ఈ సినిమాలో ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ లో స్పందన లభిస్తూ ఉండటం విశేషం.
కథ విషయానికి వస్తే... సుకుమార్ అప్పులవాళ్ల బారి నుంచి తప్పించుకోవడం కోసం మతిస్థిమితం లేనివాడిలా నటిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే పెళ్లి పట్ల అయిష్టత వ్యక్తం చేస్తూ బయటికి వచ్చేసిన షీబా బేబీ, అతనికి అందుబాటులోకి వస్తుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా అతను ఆమెను ఎలా ముగ్గులోకి దింపాడు? అనేది కథ. ఈ లైన్ లోని కొత్తదనమే ఓటీటీ ఆడియన్స్ కి నచ్చిందేమో.